మునుపటి నా మాట
కాలం తల్లి క్యాలెండర్ గా ముస్తాబై నవ మాసాలు మోసి తొమ్మిదో నెలని కంటే ఆ నెల బాలుడికి సెప్టెంబర్ అని పేరు పెట్టారు. సెప్టెంబర్ నెలా రావోయ్ (Come September) అంటూ గిటార్ మీద స్వాగత గీతం పాడారు. సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు వీళ్ళంతా చివరికి 'బరు'వు గా ఎందుకు మారారో, ఆ తరువాత వచ్చిన జనవరి,ఫిబ్రవరి చివరికి 'వర్రీ' గా ఎందుకు మిగిలారో తనకి తెలుసు కనుక 'మార్చి' నెల తన పంథా మార్చుకుంది. సరిగ్గా మార్చి 21 న సూర్యుడు భూమధ్య రేఖ పైకి వచ్చి సుఖమూ, దుఖమూ అనే పగలూ, రాత్రీ అంతటా సమానమంటాడు. అప్పటికి సూర్యుడు ఉత్తరాయణం చేస్తుంటాడు. మళ్ళీ మహానుభావుడు ఆ సూర్యుడు సెప్టెంబర్ 23 న భూమధ్య రేఖ పైకివచ్చి అప్పుడు కూడా పగలూ, రేయి సమానమంటాడు. అప్పటికి సూర్యుడు దక్షిణాయనం చేస్తుంటాడు. మెల్ల మెల్లగా చీకటి ఎక్కువ కాలం రాజ్యమేలేది ఆ పైనే. వానా కాలం కి ఉత్తర భారతంలో తెర పడేది సెప్టెంబర్ లోనే. చెన్నై మాత్రం చినుకుల కోసం ఆరాటపడేది ఈ నెలలోనే. తతిమ్మా చోట్ల అంతో ఇంతో గిలిగింతల చలి ఆశ్వయుజ ప్రారంభాన్ని సూచిస్తున్నట్టుగా వణికిస్తూ ఉంటుంది. అప్పుడు కాస్త వేడి, కాస్త ఉల్లాసం సమపాళ్ళలో కావాలి కదా. అలాంటప్పుడు ఏం చెయ్యాలి? ఒక అడుగు జాడని ఆశ్రయించాలి. అది సాహిత్యంలో కావొచ్చు, సంగీతంలో కావొచ్చు. సాహిత్య పరంగా చూస్తే కనిపించే 'అడుజాడ గురజాడది' - అన్నారుశ్రీశ్రీ. శ్రీశ్రీ కి ముందు 'మహాకవి' అని ఇక్కడ అనబోవటం లేదు. ఎందుకంటే శ్రీశ్రీ దృష్టిలో 'మహాకవి' ఒక్క గురజాడ వారే కాబట్టి. ఇక సంగీతపరంగా చూస్తే కనిపించే అడుగుజాడ లెన్నో ఉన్నాయి. అందులో 'వేళ చూడ వెన్నెలాయె', 'వెన్నెల తెచ్చాడు మా పాపడు', ' వేదన తీరగ వెన్నెల తీరుగా' అని వెన్నెల జాడలో తన ముద్రను గుప్తంగా దాచేసుకున్న మరో గురజాడ వారి అడుగుజాడ కనిపిస్తుందా? మరో గురజాడా? అదెలా సాధ్యమ్? అవును, సాధ్యం కనకనే ఈ పూట నా మాట ఇలా ఇద్దరి గురించి---.
0 Comments
|
Quick Linksపాటల కొలువు
అచ్చం అవే 'అచ్చు'లు చిరునవ్వులోని హాయి ఆహా ... ఆహహా Archives
December 2013
Categories
All
|